సమాజాభివృద్ధికి జనగణన కచ్చితత్వమే బలమైన పునాది
సమాజాభివృద్ధికి జనగణన కచ్చితత్వమే బలమైన పునాది
జనగణనలో దోషరహిత డేటా సేకరణకు ప్రాధాన్యం
క్షేత్రస్థాయి కార్యకలాపాలను పరిశీలించిన కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: సమాజ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమర్థ అమలుకు జనగణన (సెన్సస్)లో కచ్చితత్వం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. దోషరహిత డేటా సేకరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
మంగళవారం జి.కొండూరు మండలం మునగపాడు గ్రామంలో పర్యటించిన కలెక్టర్, జనగణన–2027లో భాగంగా నిర్వహిస్తున్న ఇళ్ల జాబితా (హౌస్ లిస్టింగ్) మరియు ఇళ్ల గణన (హౌసింగ్ సెన్సస్) ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెన్సస్–2027 కార్యక్రమం గత జనగణనలతో పోలిస్తే పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతోందని తెలిపారు. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ వంటి కీలక దశలను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
జనగణన విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్న కలెక్టర్, సిబ్బంది ఇంటింటికీ వెళ్లినప్పుడు ప్రజలు తమ కుటుంబాలకు సంబంధించిన పూర్తి, సరైన వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.
జనగణన ద్వారా సేకరించే గణాంకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి, గృహనిర్మాణం తదితర రంగాల్లో భవిష్యత్ కార్యాచరణకు కీలక ఆధారంగా నిలుస్తాయని వివరించారు.
ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది నిబద్ధతతో పనిచేసి నాణ్యమైన సమాచారాన్ని సేకరించాలని, ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.
