ర్యాలీకి భారీ స్పందన..

ర్యాలీకి భారీ స్పందన..

గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగనున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన లభిస్తుందని హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు. బుధవారం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మార్చి 9తో పూర్తైందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురుష అభ్యర్థులకు మార్చి 12న, తెలంగాణ రాష్ట్ర పురుష అభ్యర్థులకు మార్చి 15న ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత పురుషులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు కనీసం 152 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలని, ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, లేక 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. మొత్తం మార్కుల్లో 50 శాతం మరియు ఇంగ్లీష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి అని చెప్పారు. ఎంపికలో భాగంగా 1.6 కిలోమీటర్ల పరుగు, భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుందని, ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారని చెప్పారు.

ఈ ర్యాలీకి ఎలాంటి ఆన్‌లైన్ నమోదు అవసరం లేదని, అర్హత గల అభ్యర్థులు నేరుగా హాజరుకావచ్చని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధృవీకరించిన విద్యార్హత సర్టిఫికేట్లు (10వ, 12వ తరగతి), డొమిసైల్ సర్టిఫికేట్, ఎన్‌సీసీ సర్టిఫికేట్ (ఉంటే), ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు 10 కాపీలు, ప్రతి సర్టిఫికేట్‌కు 6 జిరాక్స్ కాపీలు తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులు ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య విశ్వవిద్యాలయం ప్రాంగణానికి చేరుకోవాలని, ఉదయం 4 గంటల నుంచే ప్రవేశానికి అనుమతి ఉంటుందని చెప్పారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు నుంచి ఆర్‌టీసీ బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదని, ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని వింగ్ కమాండర్ యాకూబ్ అలీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. గుణశీల పాల్గొన్నారు.

Leave a Reply