సమర్థవంతంగా అమలు చేయాలి..

సమర్థవంతంగా అమలు చేయాలి..
ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ : నాగర్ కర్నూల్ పట్టణంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ప్రభుత్వం మూడోసారి ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పేరిట చేపడుతున్న 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కోసం ప్రత్యేక లోగోను రూపొందించారని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ పట్టణంలోని 8వ వార్డులో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు శుభ్రత ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ నాగిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర వైస్ చైర్మన్ బాదం రమేష్ స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




