ఆ విషయంలో.. ప్రభుత్వాలు విఫలం..
ఆ విషయంలో.. ప్రభుత్వాలు విఫలం..
మునుగోడు, ఆంధ్రప్రభ : చేనేత కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా హస్తకళకు పేరుగాంచిన చేనేత రంగం దేశానికి వన్నెతెచ్చిందని, స్వాతంత్ర్య పోరాట సమయంలో విదేశీ వస్త్రాలను తగలబెట్టి ఉద్యమాలు నడిపిన వారిలో చేనేత కార్మికుల పాత్ర విశేషమని అన్నారు. అలాంటి చేనేత కార్మికులు ఈరోజు తిండి, బట్టలు లేక దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగించడం బాధాకరమని పేర్కొన్నారు. కొంతమంది కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొందరు పట్టణాలకు వలస వెళ్లి కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా అనేక మంది పద్మశాలీలు ఆత్మబలిదానాలు చేశారని గుర్తుచేశారు. చేనేత కార్మికులు అనారోగ్యాలతో బాధపడుతూ వైద్యం కోసం కూడా డబ్బులు లేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ప్రతి భారతీయుడు, ప్రతి తెలంగాణవాది సిగ్గుతో తలదించుకునే విధంగా ఉందన్నారు. కాబట్టి తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల పరిస్థితిని గ్రామాలవారీగా పరిశీలించి ఇల్లు లేని వారికి గృహాలు కల్పించాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, రంగు పదార్థాల ధరలు తగ్గించాలని, చేనేత వస్త్రాలకు మార్కెట్ ఏర్పాటు చేసి ఈ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాలను కోరారు.
