కొమ్మాల జాతరకు ఘనంగా శ్రీకారం

కొమ్మాల జాతరకు ఘనంగా శ్రీకారం
ఇటుకాలపల్లి ప్రభబండి ప్రభంజనం,
గ్రామ ఐక్యతకు నిదర్శనం,
నర్సంపేట, రూరల్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఇటుకాలపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి (కొమ్మాల) జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభబండి కార్యక్రమం భక్తి, ఐక్యత, ఉత్సాహాల మధ్య ఘనంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ శ్రీమతి మేర్గు సుమలత శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రభబండికి శ్రీకారం చుట్టగా, గ్రామమంతా హర్షధ్వానాలతో మార్మోగింది. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా పేరు గాంచిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభబండి ఏర్పాటు చేయడం విశేషం. జాతర సందర్బంగా గ్రామ ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక స్పూర్తిని చాటిచెప్పింది.
సర్పంచ్ సుమలత మాట్లాడుతూ, కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రభబండి కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని, ఇది మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామ యువత, మహిళలు, పెద్దలు అందరూ కలసికట్టుగా పాల్గొనడం గ్రామ ఐక్యతకు నిదర్శనమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు ప్రజలను మరింత దగ్గర చేస్తాయని అభిప్రాయపడ్డారు.
ప్రభబండి ఊరేగింపులో గ్రామ వీధులు రంగుల మయం కాగా, భక్తి గీతాల మధ్య ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ, జాతర సందర్భం కక్షలు, విభేదాలు మరచి అందరూ సఖ్యతతో ముందుకు సాగే సమయం అని పేర్కొన్నారు. భక్తి, ఐక్యత, అభివృద్ధి అనే మూడు సూత్రాలతో ఇటుకాలపల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా ప్రారంభమైన ఈ ప్రభబండి గ్రామ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భక్తి పరవశంలో సాగిన ఈ కార్యక్రమం ఇటుకాలపల్లి గ్రామ చరిత్రలో మరో గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచింది.
