సత్ప్రవర్తనతో ఉంటేనే రౌడీషీట్లు ఎత్తివేస్తాం.. లేదంటే పీడీ యాక్ట్

సత్ప్రవర్తనతో ఉంటేనే రౌడీషీట్లు ఎత్తివేస్తాం.. లేదంటే పీడీ యాక్ట్

-నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి హెచ్చరిక

నర్సంపేట, ఆంధ్రప్రభ:
సమాజంలో సత్ప్రవర్తనతో మసలుకుంటేనే రౌడీషీట్లు ఎత్తివేస్తామని, ప్రవర్తన మారకపోతే కఠిన చర్యలు తప్పవని నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధికి చెందిన 126 మంది రౌడీషీటర్లకు సోమవారం ఏసీపీ కార్యాలయంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. రౌడీషీటర్లు తమ పాత ప్రవర్తనను పూర్తిగా మార్చుకుని, సమాజంలో అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ, తలలో నాలుకలా మెలిగితేనే వారిపై ఉన్న రౌడీషీట్లను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అలా కాకుండా పాత పద్ధతిలోనే హింసాత్మక లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే.. వారిపై పీడీ యాక్ట్ (PD Act) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనివల్ల పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల వరకు జరిమానా కూడా అనుభవించాల్సి వస్తుందని గుర్తుచేశారు.

ప్రతి ఒక్కరూ తమ భార్యాపిల్లలు, కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవించాలని ఏసీపీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్ట్ చేసి, స్థానిక మండల మేజిస్ట్రేట్ (తహశీల్దార్) ముందు బైండోవర్ చేస్తామని, ఆ తర్వాత చట్టం ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. రౌడీయిజం వదిలిపెట్టి, ప్రజలకు సహకరిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆయన హితవు పలికారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply