about trump | సోది సెపుతానమ్మ సోది…

about trump| సోది సెపుతానమ్మ సోది…
about trump | ట్రంపు గారు కనిపించిన వేదికనల్లా ఎక్కి,
ఎదుటపడిన వ్యక్తికల్లా ఎలుగెత్తీ, యుద్ధాలు నేనే
ఆపానని చెబుతుంటే ఎవరూ పట్టించుకోరాయె.
నోబెల్ శాంతి పురస్కారం కావాలని అడుగుతుంటే ఇవ్వరాయె.
అమెరికా ఆర్థిక స్థితి బాగుందని చెప్తూంటే నమ్మరాయె.
ఒక సాయంత్రం శ్వేత సౌధం బయటికొచ్చి అలా అలా షికారుకని నడుస్తూంటే, ఒక సోదమ్మ కనిపించింది. రా రమ్మని పిలిచింది. ట్రంపు గారు బుద్ధిగా వెళ్ళి ఆమె ముందు కూర్చున్నారు…
ఆమె చెప్పేది వింటున్నారు..
ఏమాటకామాటే చెప్పుకోవాలి. అన్నీ ఉన్నమాటలే చెప్పింది సోదెమ్మ….మీరేమంటారు?
ఆమె సోది ఆమె మాటల్లోనే చదవండి మరి.

సోది సెపుతానమ్మ సోది….
ఉన్నద్దున్నట్టు సెబుతాను….
లేనిది లేనట్టు సెబుతాను…
ఓ. దొర….
ఏంది గట్ల జూస్తున్నవ్…
రా కూసో…
సోది జెపుత….
నీకు దూకుడెక్కువ దొర…
ఉన్నతాన ఉండవ్…
ఊకున్నోల్లను కదిలిస్తవ్…
దోస్తులనుగుడ ఒదలవ్…
అందర్ని దుష్మన్ లను జేసుకుంటవ్…
పెద్దన్నననుకుంటవ్…
పెద్దరికమే సూపించవ్
గీ టూమి మొత్తం నీ సెప్పుసీతుల్లల్ల
ఉండాలనుకుంటనీ..
బయపెట్టి బెదిరిస్తవ్…
యుద్ధాలు జేసిస్తవ్…
యుద్ధాలు నేనే ఆసినా అంటవ్…
నోబల్ ప్రైజు కావాలంటవ్…
ఇయ్య నోల్లను తిడతవ్…
గిట్లయితే ఎట్ల దొర….
సుంకాలంటవ్…
బింకంగ ఉంటవ్…
అంతలోనే కిందికి దిగుతవ్…
నిన్ను అర్ధం జేసుకునేదెట్ల దొర….
నీకు ఓటేసినోల్లకు సుకం లేదాయె…
నిన్ను నమ్ముకున్నోల్లకు మనశ్శాంతి లేదాయె.
నీ దేశమే నీకు బయపడ్తున్నది దొరా…
నువ్వెప్పుడు దిగిపోతవని ఎదురుసూస్తున్నది దొర….
ఏ దేశం మీద నీ కన్ను పడ్డదో అని సిన్న సిన్న దేశాలన్ని బయపడ్తున్నయి దొర…
బయటివాల్లను దేశంలోకి రావొద్దంటివి…ఉన్నోల్లకు అవకాశాలియ్యకపోతివి.
గిట్లయితే నీ కజానా ఎట్ల నిండుతది దొర?
మస్తు పైసలున్నయని బింకాలు బోతున్నవ్ దొర…
దేశమేమో పైసల్లేక అంగలారుస్తున్నది దొర…
ఓ దొర…సోది జెపుతుంటే గట్ల లేసి పోతవేంది?
కూసో …
ఔనులే…ఉన్న మాట జెప్పె ఉలుకేనాయె…. సోది సెపుతానమ్మ సోది…….
ట్రంపుగారు అటూ-సోదెమ్మ ఇటూ వెళ్ళిపోయారు.
(సరదాగా నవ్వుకోవడానికి మాత్రమే. ఎవరినీ కించపర్చడానికి కాదు)
