425 Society | ఆగని పోరు

425 Society | ఆగని పోరు
- మచిలీపట్నంలో పీఏసీఎస్ ఉద్యోగుల ధర్నా
425 Society | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఏసీఎస్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. గురువారం మచిలీపట్నంలో ధర్నా చేస్తున్న ఉద్యోగులకు పలువురు మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక (జేఏసీ) నేతలు మాట్లాడుతూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా 425 సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. సహకార సంఘ ఉద్యోగులకు ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి గతంలోనే తీసుకెళ్లినట్లు నేతలు తెలిపారు.
అరకొర జీతాలతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని వాపోతున్నారు. ప్రధానంగా జీవో నెంబర్ 36ను వెంటనే అమలుపరిచి 2019, 2024 తాలుకా పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని, ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సిలింగ్ విధించి 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని, గ్రాట్యుటీ చట్టాన్ని అమలుప రిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలని, సహకార సంఘాలలో పని చేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు అమలుపరచాలని, ఉద్యో గులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్యభీమా కల్పించి, ఉద్యోగి సర్వీస్లోలో మరణిస్తే ఆ కుటుంబం ఆధారము లేకుండా పోతున్నందున ప్రతీ ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలన చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలన్నారు.
