వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన
వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన
పంట అవశేషాలు కాల్చవద్దని సూచించిన మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్
పరకాల, ఆంధ్రప్రభ: కామారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం రైతులకు వ్యవసాయ సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాస్ పాల్గొని రైతులకు పలు వ్యవసాయ సూచనలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట అవశేషాలను, ముఖ్యంగా వరి కొయ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని సూచించారు. పంట అవశేషాలను కాల్చితే రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల నేల సారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని వివరించారు.
ప్రభుత్వం ప్రకటించిన ప్రాధాన్యమైన వరి సన్న రకాల సాగుకు అందించే బోనస్‌పై రైతులకు అవగాహన కల్పించారు. బోనస్ వర్తించే వరి రకాలను సాగు చేయాలని సూచించారు. వానాకాలం 2026 సీజన్‌కు బోనస్ వర్తించే 8 వరి రకాలను వివరించారు.
బీపీటీ-5204 సాంబా మసూరి, తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్-15048, కేఎన్ఎం-1638, జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్-962, డబ్ల్యూజీఎల్-44 సిద్ధి, జేజీఎల్-1798 రకాలను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం బోనస్ లభిస్తుందని తెలిపారు.
భూసారాన్ని పెంపొందించేందుకు పచ్చిరొట్టె ఎరువుగా జీలుగ పంటను సాగు చేసి భూమిలో కలపాలని రైతులకు సూచించారు. పచ్చిరొట్టె ఎరువు వాడకం వల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరిగి పంట దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. జీలుగ విత్తనాలు రైతు ఆగ్రోస్ పరకాలలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో అహ్మద్ రజా, గ్రామ సర్పంచ్ చిర్ర అనిత రాజయ్య, ఉప సర్పంచ్ సీపతి మౌనిక తిరుపతి, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
