Krishna district | నేరాల నివారణే లక్ష్యంగా..

Krishna district | నేరాల నివారణే లక్ష్యంగా..
Krishna district, ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం రాత్రివేళ పకడ్బందీగా గస్తీ విధులు నిర్వహిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నైట్ రౌండ్స్ నిర్వహిస్తూ బీట్ పాయింట్లను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రార్థన మందిరాలు, ఏటిఎంలు, ప్రధాన వ్యాపార సముదాయాల వద్ద నిఘాను పెంచి, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. మరో వైపు హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు.
డయల్ 100, హైవే మొబైల్ వాహనాల ద్వారా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, రాత్రి వేళల్లో డ్రైవర్లు నిద్రమత్తు కారణంగా ప్రమాదాలకు గురికాకుండా ఉండటానికి ‘వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వాహనాలను నిలిపి, డ్రైవర్లు ముఖం కడుక్కునేలా చేసి, వారికి ప్రమాదాల పట్ల అవగాహన కల్పించి పంపిస్తున్నారు. వీటికి తోడు జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు వారు చేపడుతున్న ఈ తనిఖీలకు ప్రజలు, వాహనదారులు పూర్తిస్థాయిలో సహకరించాలని పోలీసు యంత్రాంగం కోరుతోంది.

