Vijayawada | పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో కనువిందు..

  • వరి కంకుల తోరణాలు, హరిత ఆభరణాలతో శాకంభరీగా అమ్మవారి దివ్య దర్శనం..
  • దేవతామూర్తులన్నీ ప్రకృతి సంపదతో అలంకరణ..
  • భక్తులను ఆకట్టుకుంటున్న ఉత్సవాలు
  • భక్తులకు నిరంతరం ఉచితంగా కదంభ ప్రసాదం పంపిణీ
  • పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు
  • క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న ఈఓ శీనా నాయక్

Vijayawada | ( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారు శాకంభరీ దేవిగా హరిత వర్ణ ఆభరణాలు, వరి కంకుల తోరణాలతో దివ్యంగా దర్శనమిస్తూ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తుతున్నారు. శాకంభరీ ఉత్సవాల సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అపూర్వంగా అలంకరించగా, ప్రకృతి వైభవాన్ని ప్రతిబింబించేలా ఆలయ ప్రాంగణం శోభాయమానంగా మారింది.

సర్వాంగ సుందరంగా అలంకరణ..

ఆలయంలోని అమ్మవారి ప్రధానాలయం ఉప ఆలయాలతో పాటు దేవతామూర్తులన్నీ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆభరణాలుగా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శాకంభరీ రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది.

ఉచితంగా కదంబ ప్రసాదం..

శాకంభరీ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి సమర్పించే కదంభాన్ని భక్తులకు నిరంతరం ఉచిత ప్రసాదంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, ప్రసాదాల పంపిణీ, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.
గంట గంటకూ భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని, భక్తులు సహకరించి ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని దేవస్థాన అధికారులు విజ్ఞప్తి చేశారు.