సాంకేతిక నైపుణ్యాలు అలవర్చుకోవాలి

సాంకేతిక నైపుణ్యాలు అలవర్చుకోవాలి
జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
శ్రీకాకుళంలో ల్యాబ్ ఆన్ వీల్స్ బస్సు ప్రారంభం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : నేటి తరం విద్యార్థులు భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలు, ఆవిష్కరణాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ల్యాబ్ ఆన్ వీల్స్ బస్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జేసీ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి బస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సైతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసేందుకు ఏపీఎస్ఎస్డీసీ ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ మొబైల్ ల్యాబ్‌లో విద్యార్థులకు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, 3డి ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ఆధునిక అంశాలపై ప్రాయోగిక శిక్షణ ఇస్తారని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు. సాయికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు భవిష్యత్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవసరమైన సాంకేతికతను చిన్న వయస్సు నుంచే పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని మరిన్ని పాఠశాలల్లో ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్వహించి, వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి కె. సుధ, జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏపీఎస్ఎస్డీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
