రాత్రివేళ నేరాల నియంత్రణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

శ్రీ సత్యసాయి, జూలై 16 (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లాలో రాత్రివేళ నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బీట్ గస్తీ, పెట్రోలింగ్‌ను విస్తృతంగా నిర్వహించారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జరిగే అక్రమ రవాణా, అసాంఘిక శక్తుల రాకను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీలను ముమ్మరం చేసి, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను విచారించి వారి వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన వారి వేలిముద్రలను సేకరిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, నివాస ప్రాంతాలు, తాళాలు వేసి ఉన్న ఇళ్ల వద్ద ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి చోరీలకు అవకాశం లేకుండా పహారా నిర్వహిస్తున్నారు.

ఇక గ్రామాల్లో గ్రామసభల ద్వారా సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజల సహకారం లేకుండా నేరాల నియంత్రణ సాధ్యం కాదని పేర్కొన్న జిల్లా పోలీసులు, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు లేదా అపరిచిత వస్తువులు కనిపించిన వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించగలమని తెలిపారు.