40kmsspeedair భానుడి ప్రతాపానికి బ్రేక్… ఒక్కసారిగా మారిన వాతావరణం

40kmsspeedair భానుడి ప్రతాపానికి బ్రేక్… ఒక్కసారిగా మారిన వాతావరణం
40kmsspeedair హస్నాపూర్ వద్ద భారీ వర్షం… మండలంలో చల్లని గాలులు
ప్రజలకు ఊరట… రైతులకు ఆందోళన
ఈదురుగాలుల హెచ్చరిక…
40kmsspeedair ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు 43°C దాటుతుండటంతో ఉట్నూరు మండల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే, నేడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు మలమల మాడ్చిన ఎండ మాయమై, ఆకాశం మేఘావృతమై చల్లని ఈదురుగాలులు మొదలయ్యాయి.

ముఖ్యంగా హస్నాపూర్ ఎక్స్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వర్షం కాసేపు బలంగా కురిసింది. ఉట్నూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. మండుతున్న వేడిమి నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో మండల కేంద్రంలోని ప్రజలు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. చల్లని గాలులు వీచడంతో సాయంత్రం వేళ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
అయితే, ఈ అకాల వర్షం ఒకవైపు సామాన్యులకు ఉపశమనం కలిగించినా, మరోవైపు రైతన్నల్లో ఆందోళన నింపింది. ఈదురుగాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడగా, ఆరబోసిన ధాన్యం తడిసిపోకుండా చూసుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. ఉట్నూరు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 36°C – 39°C మధ్య నమోదవుతున్న తరుణంలో, ఈ అకస్మాత్తు మార్పు ప్రకృతి ఇచ్చిన సర్ప్రైజ్ లాంటిదే.
IMD (భారత వాతావరణ శాఖ) ముందస్తు హెచ్చరికల ప్రకారం అదిలాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ నుంచి ఉపశమనం లభించినా, ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఉండవద్దని హెచ్చరిస్తున్నారు.
