ఈ ప్రతిభ పదిలం.. భవిష్యత్తుకు అందలం..

ఈ ప్రతిభ పదిలం.. భవిష్యత్తుకు అందలం..
ఇదే స్ఫూర్తితో జీవితంలో ఉన్నతంగా ఎదగాలి
సత్ఫలితాలిచ్చిన 100 రోజుల కార్యాచరణ వ్యూహం
72 శాతం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఓ చారిత్రక ఘట్టం
జిల్లాను ముందంజలో నిలిపిన ప్రతిఒక్కరికీ అభినందనలు
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
భవిష్యత్తుకు ప్రేరణగా లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయని.. విద్యార్థులు తమ ప్రతిభను, జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి 580, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులు, మండల టాపర్లు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులతో పాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం సోమవారం నగరంలోని పటమట, సాయి జువెల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది.

అదేవిధంగా భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు టాపర్స్‌కు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులను పతకాలు, ప్రశంసా పత్రాలు, శాలువాలతో సత్కరించారు. మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గౌరవ సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారుల ప్రత్యేక చొరవ ఫలితంగా ఈ ఏడాది పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికా వ్యూహం అద్భుత ఫలితాలు ఇచ్చిందని.. 72 శాతం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతిరోజూ స్లిప్ టెస్టులు నిర్వహించి బలాలు, బలహీనతలను గుర్తించి విద్యా సముపార్జనలో సమస్యలను తొలగించడం జరిగిందన్నారు. ఈ కార్యాచరణ ప్రణాళిక విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి మంచి ఫలితాల సాధనకు దోహదం చేసిందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.

ప్రతిభను గుర్తించి.. భవితకు ప్రేరణగా నిలిచి..
వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షల్లో మరింత ఉన్నత విజయాలు సొంతం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సత్కార కార్యక్రమంతో పాటు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మహమ్మద్ ఎ.ఫర్హీన్ 595 మార్కులు, కె.నాగదుర్గారాణి 593 మార్కులు, జి.నిత్య సాత్విక 591 మార్కులతో ఇలా ఎందరో విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలిచారని.. జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషిచేశారన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ముఖ్యంగా తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ర్కొన్నారు.

మార్గదర్శులు చేయందించాలి..
పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన చిన్నారులు వారి కెరీర్ కలలను ఆవిష్కరించారని.. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన ఈ విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు మనసున్న మార్గదర్శులు పీ4 కార్యక్రమం ద్వారా ముందుకు రావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఈ ఆణిముత్యాలకు చేయూతనందించి బంగారు భవిష్యత్తు అందించేందుకు ముందుకొచ్చి, ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా నిలవాలని కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు విశేష కృషిచేస్తోందని..
వినూత్న కార్యాచరణతో ముందుకెళ్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో డీఈవో ఎల్.చంద్రకళ, డిప్యూటీ డీఈవోలు సాంబశివరావు, గుర్నాథం, శ్యాంసుందర్, మార్గదర్శి యు.నిరుపమ బలరాం (సాయి మందిర్ కమిటీ)తో పాటు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
