3000crore | ఇంతలా పెరుగుతున్నాయా?

3000crore | ఇంతలా పెరుగుతున్నాయా?
3000crore | మద్యం ధరల పెంపుపై ప్రభుత్వ కసరత్తు
ప్రీమియం, సాధారణ బ్రాండ్లపై భారీ ప్రభావం
ఇంధన ధరల పెరుగుదలతో తయారీ ఖర్చుల భారము
కంపెనీల ఒత్తిడి, కమిటీ పరిశీలన
ప్రభుత్వానికి వేల కోట్ల అదనపు ఆదాయం అంచనా
సామాన్యుడిపై మరింత ఆర్థిక భారం
3000crore | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ మద్యం ధరల పెంపునకు కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. మద్యం బాటిల్ రకాన్ని బట్టి ధరల పెంపు ఉండనుంది. ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై రూ.100 వరకు ధర పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం. సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి ప్రభుత్వం ధలను సవరిస్తూ వస్తుంది. 2023 మే నెలలో గత ప్రభుత్వం ధరలు పెంచింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు, పలు కంపెనీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో దాని ప్రభావం మద్యం తయారీపై కూడా చూపింది. అయితే బాటిళ్ల తయారీకి వినియోగించే గ్యాస్ ధరలు, రవాణా, ముడి సరుకుల ఖర్చులు పెరగడంతో కంపెనీలు గతేడాది నుంచే ధరల సవరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ధరల నిర్ధారణ కమిటీని రంగంలోకి దించింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ వచ్చే వారం కంపెనీల ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి ధరల పెంపుపై నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.

అయితే ఈ ధరల పెంపుపై సామాన్యుల తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం మధ్యేమార్గంగా ధరలను నిర్ణయించాలని యోచిస్తోంది. సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై రూ.60, ప్రీమియం బ్రాండ్లపై రూ.100, అంతకంటే పై స్థాయి బ్రాండ్లపై రూ.120 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెంపు ద్వారా నెలకు రూ.250 కోట్లు.. ఏడాదికి సుమారు రూ.3000 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరుతుందని ఎక్సైజ్ అంచనా అధికారులు వేస్తున్నారు. సాధారణంగా ధరలు పెరిగినప్పుడు కొద్దిరోజుల పాటు అమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, ప్రభుత్వ ఆదాయం మాత్రం పెరుగుతుందని అంచనా. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి, ఇప్పుడు మద్యం ధరల పెంపు అదనపు భారం కానుంది.
CLICK HERE TO READ MORE 10 acres | బతుకమ్మకుంటపై హైడ్రా వివరణ
