అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు
- మహాలక్ష్మి ఉచిత ప్రయాణం ఓ మైలురాయి
- టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్‌లో నియోజకవర్గస్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రూ.500లకే గ్యాస్ కలెక్షన్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.195.18 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో జ్యోతి, సంగారెడ్డి ఆర్డీఓ గున్నాల రాజేందర్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్మన్లు కూన వనిత, అంజమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, సీడీసీ చైర్మన్ గడీల రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాథోడ్ రామచంద్రనాయక్, మున్సిపల్ కమిషనర్లు మట్ట శ్రీనివాస్ రెడ్డి, శివాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
