మహిళా సంక్షేమంలో ఆమె మార్గం..

మహిళా సంక్షేమంలో ఆమె మార్గం..

లక్ష్యం దిశగా ..
రెండో ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకుతో సీడీపీఓగా ఎంపిక
పట్టుదలతో శ్రమిస్తే పేదరికం అడ్డుకాదు
బెల్లంపల్లి సీడీపీఓ గాండ్ల స్వరూపరాణి
నేడు మహిళ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : “కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు” అన్న మాటను అక్షరాలా నిజం చేశారు బెల్లంపల్లి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో) గాండ్ల స్వరూపరాణి. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి, పట్టుదలతో శ్రమించి రాష్ట్ర స్థాయిలోనే టాపర్‌గా నిలిచిన ఆమె ప్రయాణం నేటి యువతకు, ముఖ్యంగా మహిళలకు ఒక గొప్ప స్ఫూర్తి పాఠం.

బెల్లంపల్లి గడ్డపైనే విద్యాభ్యాసం..

బెల్లంపల్లిలోనే పుట్టి పెరిగిన స్వరూపరాణి, తన ప్రాథమిక విద్యను బజార్ ఏరియాలోని జెడ్పీహెచ్ఎస్ మరియు బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ కళాశాలలోనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి.. ఎం.ఏ, బీఈడీ పట్టాలను అందుకున్నారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కుమార్తెగా, సామాన్య నేపథ్యం నుండి వచ్చినప్పటికీ ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పం ఆమెలో బలంగా ఉండేది.

ఓటములను గెలిచి.. విజేతగా నిలిచి..

ప్రభుత్వ ఉద్యోగ వేటలో ఆమెకు మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. రెండు సార్లు టీచర్ ఉద్యోగం, గ్రూప్-1, గ్రూప్-2 వంటి అవకాశాలు అతి తక్కువ దూరంలో చేజారిపోయాయి. అయినప్పటికీ కుంగిపోకుండా, తన భర్త (ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మాజీ టీటీజేఏసీ చైర్మన్) అందించిన ప్రోత్సాహం, ఆత్మస్థైర్యంతో ముందడుగు వేశారు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నప్పటికీ, ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే రోజుకు 10 గంటల పాటు నిరంతరం కష్టపడి చదివారు. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ సెక్రటరీగా 7వ ర్యాంకు సాధించడమే కాకుండా, ఏపీపీఎస్సీ నిర్వహించిన సీడీపీఓ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ ర్యాంకు సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నారు.

పదేళ్ల అనుభవం.. సొంత గడ్డపై సేవ..

2014లో నియమితులైన స్వరూపరాణి, తన మొదటి పోస్టింగ్‌లో రామగుండంలో పదేళ్ల పాటు సమర్థవంతంగా సేవలు అందించారు. ప్రస్తుతం తన సొంత పట్టణమైన బెల్లంపల్లిలో సీడీపీఓగా బాధ్యతలు చేపట్టి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై ఆమె ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.