1stMaysplstory | తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులు

1stMaysplstory | తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులు

1stMaysplstory | తమిళనాడులో ముక్కోణపు పోటీ విశ్లేషణ
విజయ్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు
డీఎంకే, ఏఐడీఎంకే పై ప్రభావం
జాతీయ రాజకీయాలపై ప్రతిఫలం
యువత రాజకీయాల్లో కొత్త తరంగం

1stMaysplstory | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మే 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడగా, వాటిపై చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడులో ముక్కోణపు పోటీ జరిగింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేతృత్వంలోని కూటమి లేదా ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐడీఎంకే) నేతృత్వంలోని కూటమి విజయం సాధించవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు.

ఆశ్చర్యకరంగా, కొన్ని సర్వేలు ఈ రెండు కూటములు కాకుండా సినీనటుడు మెగాస్టార్‌ విజయ్‌ నేతృత్వంలోని టీవీకే విజయం సాధించవచ్చని జోస్యం చెప్పాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన నిర్వహించిన సభలు, ర్యాలీలకు అశేషంగా జనం హాజరయ్యారు. 234 మంది సభ్యులు గల అసెంబ్లీలో ఆయన పార్టీ 20 నుంచి 25 స్థానాలు గెలుచుకోవచ్చని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. అయితే ఆయన పార్టీ డీఎంకే కూటమిని దెబ్బతీస్తుందా? లేక ఏఐడీఎంకే కూటమి విజయావకాశాలను ప్రభావితం చేస్తుందా? అనే అంశంపై చర్చ కొనసాగుతోంది.

తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని విజయ్‌ ధీమాగా చెబుతున్నప్పటికీ, ఆయన ప్రకటనలను చాలా మంది నమ్మడం లేదు. ఆయన గెలుపుపై ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విజయ్‌ నెగ్గితే, పెద్ద ప్రభావం:

  1. తమిళనాడు రాజకీయాల్లో 1967 నుంచి కొనసాగుతున్న ద్రవిడ రాజకీయ వ్యవస్థకు విజయ్‌ విజయంతో విఘాతం కలగవచ్చు. అప్పటి నుంచి డీఎంకే లేదా ఏఐడీఎంకే వంతుల వారీగా అధికారాన్ని చేపడుతున్నాయి. విజయ్‌ గెలుపుతో ఈ ధోరణి మారి, చరిత్రకు భిన్నమైన పరిణామం చోటు చేసుకోవచ్చు.
  2. ఏఐడీఎంకే ఉనికికి ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ పార్టీ 2016లో జయలలిత నేతృత్వంలో గెలిచింది. ఆ తర్వాత ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో డీఎంకే అధికారంలోకి వచ్చింది. వరుసగా పదేళ్లు అధికారంలో లేకపోతే ఆ పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. అంతర్గత విభేదాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
  3. ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే కూడా ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. పటిష్టమైన నిర్మాణం, వ్యవస్థీకృత బలం ఉన్న పార్టీగా పేరుగాంచిన డీఎంకేలో అంతర్గత సంస్కరణలు అవసరం అయ్యే పరిస్థితి రావచ్చు.
  4. విజయ్‌ అన్ని వర్గాలను కలుపుకునే తత్వం, ముఖ్యంగా హిందూ ఆలయాల సందర్శనలు, తమ పార్టీపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నాలు ఆయనకు విస్తృత మద్దతు తెచ్చిపెట్టవచ్చు.
  5. రాష్ట్రంలో కూటములు మార్పులకు లోనవచ్చు. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌ తమ పరిస్థితిని పునఃసమీక్షించుకోవచ్చు. చిన్న పార్టీలు విడిపోయి విజయ్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
  6. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన వ్యూహాన్ని తిరిగి సమీక్షించుకోవచ్చు. రాష్ట్రంలో ఎదగడానికి పదేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.
  7. తమిళనాడులో డీఎంకే ఓటమి చోటుచేసుకుంటే జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి ఇది నష్టంగా మారే అవకాశం ఉంది.
  8. సంప్రదాయక వంశపారంపర్య రాజకీయాలకు భిన్నంగా యువతకు ప్రాధాన్యం ఇస్తానన్న హామీతో విజయ్‌ ముందుకు సాగవచ్చు. కొత్త నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగవచ్చు.

ముగింపు:

ఇటీవల కాలంలో నటుడు విజయ్‌ రాజకీయ ప్రవేశం, ఎన్నికల్లో సాధించే విజయంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. పూర్తిగా సంక్షోభం లేకుండా పునర్‌వ్యవస్థీకరణ జరిగే అవకాశముంది. కొత్త కూటములు ఎర్పడవచ్చు. అయితే అసలైన సవాలు పరిపాలనలోనే ఉంటుంది. విధానాల అమలు, ప్రజా విశ్వాసం పొందడం కీలకం.

మన దేశంలో విజయ్‌ విజయం జెన్‌-జి లేదా యువతరం విజయానికి సంకేతంగా మారవచ్చు. అవినీతి, వంశపారంపర్య రాజకీయాలపై ప్రజల్లో విసుగు పెరిగింది. ఇతర రాష్ట్రాల్లో కూడా యువత ఒక శక్తిగా ముందుకు రావచ్చు. మే 4వ తేదీ ఫలితాల కోసం ఎదురుచూడాల్సిందే. తమిళనాడులో రాజకీయ తుపాను ముంచుకొస్తుందేమో!

డా.పెంటపాటి పుల్లారావు

Leave a Reply