1Cr Above | రికార్డు స్థాయిలో బంగారం ధరలు, ఇంకా పెరిగే ఛాన్స్
1Cr Above | రికార్డు స్థాయిలో బంగారం ధరలు,
ఇంకా పెరిగే ఛాన్స్
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
పెట్టుబడిదారులకు ఇదే సరైన సమయమా?
1Cr Above | ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంటున్నాయి, చేరుకోబోతున్నాయి కూడా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు లక్ష రూపాయల మార్క్‌ను దాటిన తర్వాత కూడా ఎక్కడా ఆగడం లేదు. ఒకడుగు వెనక్కి, పదడుగుల్ ముందుకి అన్నట్టు పెరుగుతూనే ఉంది.
దాని ప్రకారం కిలో (1000 గ్రాములు) బంగారం ధర కోటి రూపాయల పైచిలుకు స్థాయిలో ఉంది.
అయితే, బంగారం ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అన్ని ప్రాంతాల్లోనూ ఒకేలా ఉండదు కూడా. రోజువారీగా ప్రాంతాలను బట్టి మారుతూనే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, దిగుమతి సుంకాలు, రాష్ట్రాలవారీ పన్నులు, మేకింగ్ ఛార్జీలు వంటి అంశాలపై ఆధారపడి ఒక్కో నగరంలో బంగారం ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తాయి. అందుకే ఖచ్చితమైన ధర తెలుసుకోవాలంటే స్థానిక బులియన్ మార్కెట్ లేదా విశ్వసనీయ జ్యూయెలర్ను సంప్రదించడం అవసరం.
ఇటీవలి కాలంలో బంగారం ధరలు వేగంగా పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కూడా బంగారానికి డిమాండ్‌ను పెంచుతోంది. యుద్ధాలు, దేశాల మధ్య నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అమెరికా-చైనా-భరత్-రష్యా తదితర దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు వంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల కంటే బంగారాన్ని భద్రమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.
అదే విధంగా, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది. అలాంటి సమయంలో విలువను నిలబెట్టుకునే ఆస్తిగా బంగారానికి ప్రాధాన్యం పెరుగుతుంది. అంతేకాదు, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం నిల్వలు పెంచుకుంటుండటం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా మారుతోంది.
బంగారం ధరలు ఒక్క అంశం వల్ల కాకుండా అనేక అంశాల ప్రభావంతో మారుతుంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ బంగారం ధరలు – లండన్ బులియన్ మార్కెట్, న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ల లోని ధరలే ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉంటాయి.
డాలర్ – రూపాయి మారకం విలువ కూడా బంగారం ధర పెరగడానికి ముఖ్యకారణం. డాలర్ బలపడితే భారత్‌లో బంగారం ధర పెరుగుతుంది.
ద్రవ్యోల్బణం ఎక్కువైతే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.
వడ్డీ రేట్లు తగ్గితే బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయి.
భారత్‌లో సాంప్రదాయంగా బంగారం వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరుగుతాయి.
ప్రభుత్వ విధానాలు, దిగుమతి సుంకాలు – దిగుమతులపై పన్నులు పెరిగితే ధర నేరుగా ప్రభావితమవుతుంది.
బంగారం కొనుగోలు చేసే సమయంలో నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ విషయాలు తప్పనిసరిగా గమనించాలి:

హాల్‌మార్క్ ఉన్న బంగారమే కొనాలి
బంగారంపై 22కే లేదా 24కే ముద్ర ఉందా చూడాలి
హాల్‌మార్క్‌లో బీఐఎస్ లోగో, స్వచ్ఛత స్థాయి, హాల్‌మార్క్ సెంటర్ కోడ్ ఉండాలి
నమ్మకమైన జ్యూయెలర్ వద్ద నుంచే కొనుగోలు చేయాలి
తప్పనిసరిగా బిల్ తీసుకోవాలి
ఇలా చేస్తే నకిలీ బంగారం లేదా తక్కువ నాణ్యత బంగారం కొనుగోలు చేసే ప్రమాదం ఉండదు.
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, తక్షణ కాలంలో బంగారం ధరలు కొంత స్థిరంగా కదలాడినా, దీర్ఘకాలికంగా పెరుగుదల ధోరణి కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తమైతే, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగితే బంగారం ధరలు కొత్త రికార్డులను నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాల పెట్టుబడి కోణంలో చూస్తే బంగారం ఇప్పటికీ భద్రమైన ఎంపికగా కొనసాగుతోంది. అందుకే ధరలు పెరిగినా, బంగారం మీద పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గే సూచనలు కనిపించడం లేదు.
బంగారం భారతీయుల జీవితంలో కేవలం ఆభరణం మాత్రమే కాదు…
ఆర్థిక భద్రతకు సంకేతం. జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక అనిశ్చిత కాలంలో పెట్టుబడులకు బంగారం ఇప్పటికీ ఎప్పటికీ నమ్మకమైన మార్గం.
click here to read 22 carat gold price today | బంగారం, వెండి ధరలకు కొత్త గరిష్టాలు
