భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

వాతావరణ శాఖ, పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి: ఎస్‌ఐ పాండు

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సంస్థాన్ నారాయణపురం ఎస్‌ఐ పాండు ఒక ప్రకటనలో సూచించారు.

అత్యవసర పరిస్థితులు మినహా అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని తెలిపారు. ఉరుములు, మెరుపులు సంభవిస్తున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా తెగిపోయిన విద్యుత్ తీగల సమీపంలో నిలబడవద్దని హెచ్చరించారు.

వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లేందుకు లేదా వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కాలువలు, చెరువులు, వాగులు, వరద నీటి ప్రాంతాల వద్దకు వెళ్లనివ్వకుండా పర్యవేక్షించాలని కోరారు.

వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ పాండు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.