గుండు గీయించుకుంటే 15 వేలు
ఫోన్ కాల్‌ను నమ్మి మోసపోయిన మహిళలు
కొత్త వ్యాధి పేరుతో దుండగుడి మోసం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సినీ హీరో రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ సినిమాలో గుండు చేయిస్తే డబ్బులు వస్తాయని మహిళలను నమ్మించే సన్నివేశం గుర్తుందా? అలాంటి ఘటన నిజ జీవితంలోనూ చోటుచేసుకుంది. గుండు చేయించుకుంటే రూ.15 వేల ప్రోత్సాహకం ఇస్తామని నమ్మించి, ముగ్గురు మహిళలను మోసం చేసిన ఘటన తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి గ్రామంలో వెలుగుచూసింది.
కొత్త వ్యాధి నుంచి రక్షణ కలుగుతుందని, ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం ఇస్తోందంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌లో నమ్మించాడు. నిజమేనని భావించిన ముగ్గురు మహిళలు గుండు చేయించుకోగా, చివరకు అది ఆకతాయిల పని అని తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రభుత్వ అధికారి పేరుతో ఫోన్
పుదుకొత్తంబాడికి చెందిన పళనియమ్మాళ్ అనే మహిళకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి, తాను తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్న ప్రభుత్వ అధికారినని పరిచయం చేసుకున్నాడు. కరోనా తరహాలోనే మరో కొత్త అంటువ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని, విదేశాల్లో ఆ వ్యాధి నుంచి బయటపడిన వారంతా గుండు చేయించుకున్నారని చెప్పి భయపెట్టాడు. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తోందని, గుండు చేయించుకునే మహిళలకు రూ.15 వేలు, పాఠశాల, కళాశాల విద్యార్థినులకు రూ.45 వేలుతో పాటు ఉచిత ల్యాప్‌టాప్, పురుషులకు రూ.6 వేల ప్రోత్సాహకం అందజేస్తుందని నమ్మించాడు. మొదటి విడతలో 18 మందికి మాత్రమే అవకాశం ఉందని, జాబితాలో ఆమె పేరు ఉండటంతోనే ఫోన్ చేస్తున్నానని చెప్పడంతో బాధితురాలు నమ్మింది.
మరికొందరికి చెప్పడంతో…
ఈ విషయాన్ని పళనియమ్మాళ్ తన పరిసర మహిళలకు తెలియజేయడంతో వారు కూడా నిజమేనని భావించారు. వెంటనే క్షురకుడిని పిలిపించుకుని గుండు చేయించుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు పూర్తిగా గుండు చేయించుకున్నారు.
స్విచ్ఛాఫ్‌తో బయటపడిన మోసం
అనంతరం నగదు ఎప్పుడు ఇస్తారని తెలుసుకోవడానికి అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేయగా, అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన మహిళలు విచారించగా, ప్రభుత్వం నుంచి అలాంటి ఎలాంటి పథకం లేదని తెలిసింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు పోలీసుల సూచనలు
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, నగదు ప్రోత్సాహకాలు లేదా ఇతర ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ వెబ్‌సైట్లు లేదా సంబంధిత కార్యాలయాల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
