ఓటర్ల జాబితా ప్రక్షాళనలో ‘సర్’ ప్రక్రియ కీలకం

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: బీజేపీ నేత ఎరుకల గణపతి

చిట్యాల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ ఎంతో కీలకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరుకల గణపతి అన్నారు.

బుధవారం మండల కేంద్రంలో బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు జాబితాలోని లోపాలను సరిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

సర్ ప్రక్రియ ద్వారా కొత్త అర్హులైన ఓటర్లను చేర్చడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, డూప్లికేట్ ఓట్లను గుర్తించడం, పేరు, చిరునామా తదితర వివరాల్లోని తప్పులను సరిచేయడం జరుగుతుందని తెలిపారు. అధికారులు, బీఎల్‌ఓలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించాలని, ప్రజలు కూడా తమ ఓటు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకుని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూ.15 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య ప్రమాదంలో పడిందని ఆరోపించారు.

ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అనేక విద్యాసంస్థలు విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని, ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయనివ్వమని హెచ్చరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు.

ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని విమర్శించారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేసి, విద్యార్థుల సర్టిఫికెట్లను అందజేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదలయ్యే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్, రాయిని శ్రీనివాస్, కేంసారపు ప్రభాకర్, వల్లాల ప్రవీణ్, కల్వచర్ల కిషోర్, ర్యాకం శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.