PanIndia | హైప్‌తో ఓపెనింగ్స్.. ఆ తరువాతే ‘‘అసలు కథ’’!

PanIndia | హైప్‌తో ఓపెనింగ్స్.. ఆ తరువాతే ‘‘అసలు కథ’’!

  • పెద్ద సినిమాలను చంపేస్తోంది హైపేనా..?
  • సినిమా ప్రాణం తీస్తున్న‌ పాన్ ఇండియా..?
  • అంచనాల భారం.. భారీ సినిమాల పరాభవం..!

ఆంధ్రప్రభ : ఒకప్పుడు స్టార్ హీరో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూలు కట్టేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఒక కీలకమైన తేడా కనిపిస్తోంది. చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్లు కొడుతుంటే.. వందల కోట్ల బడ్జెట్‌తో, ఏళ్ల తరబడి నిర్మించిన భారీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలమవుతున్నాయి. దీంతో పెద్ద సినిమాలను చంపేస్తోంది హైపేనా? పాన్ ఇండియా యుగంలో పెద్ద సినిమాల వైఫల్యాల వెనుక అసలు కారణాలేంటి..? పెద్ద సినిమాలు అంచనాల భారం మోయలేకపోతున్నాయా అనే ప్రశ్నలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

చిన్న సినిమాలకు సాధారణంగా ప్రేక్షకుల నుంచి ముందస్తు అంచనాలు చాలా తక్కువగా ఉంటాయి. ట్రైలర్ లేదా కంటెంట్ నచ్చితే థియేటర్‌కు వెళ్తారు. సినిమా బాగుంటే మాటల ద్వారా ప్రచారం పెరిగి విజయాన్ని అందుకుంటుంది. కానీ భారీ సినిమాల విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

PanIndia

ఒక స్టార్ హీరో సినిమా ప్రకటించిన రోజే అంచనాల మోత మొదలవుతుంది. ఫస్ట్ లుక్, టైటిల్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతి అప్డేట్‌తో అంచనాలు పెరుగుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో అభిమానులు, యూట్యూబ్ ఛానళ్లు, ట్రేడ్ వర్గాలు కలిసి సినిమాను ఆకాశానికెత్తేస్తాయి. ఫలితంగా సినిమా విడుదలయ్యే సమయానికి ప్రేక్షకుల ఊహలు వాస్తవానికి అందనంత ఎత్తుకు వెళ్లిపోతాయి.

దీనికి తోడు పాన్ ఇండియా (PanIndia ) క‌ల్చ‌ర్ ఒక‌టి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కించాలనే ఆలోచనతో భారీ ప్రాజెక్టుల నిర్మాణం రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు సాగుతోంది. ఈ సుదీర్ఘ గ్యాప్‌లో సినిమా చుట్టూ హైప్ అంతకంతకూ పెరుగుతుంది. టీజర్లు, గ్లింప్స్, పోస్టర్లు, సోషల్ మీడియా చర్చలు, ఫ్యాన్ థియరీలతో ప్రేక్షకులు తమ ఫేవరెట్ హీరో సినిమా గురించి ఊహలకు రెక్కలు కడతారు. కథ ఎలా ఉంటుందో, పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో తమలో తామే ఎన్నో అంచనాలు వేసుకుంటారు.

ఇలా ప్రేక్షకుల మనసుల్లో ఒక పర్‌ఫెక్ట్ మూవీ రూపుదిద్దుకుంటుంది. కానీ థియేటర్‌లో కనిపించేది మాత్రం దర్శకుడు రూపొందించిన‌ సినిమా మాత్రమే. ప్రేక్షకుల ఊహలకు, తెరపై కనిపించిన కథకు మధ్య చిన్న గ్యాప్ వచ్చినా అది వెంటనే నిరాశగా మారుతుంది. కొన్నిసార్లు సినిమా బాగానే ఉన్నప్పటికీ, అంచనాల భారం కారణంగా ప్రేక్షకులకు అది తక్కువగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది.

మరో అంశం టికెట్ ధరలు. అభిమానుల ప్రేమ, స్టార్ హీరోల క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో భారీ సినిమాలకు టికెట్ రేట్లు భారీగా పెంచడం ఇప్పుడు సాధారణమైంది. సాధారణ సినిమా కోసం ఖర్చు చేసే దానికంటే రెట్టింపు, మూడింతలు ఖర్చు చేసి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు సహజంగానే ఎక్కువ వినోదాన్ని ఆశిస్తాడు. ఆ అంచనాలకు సినిమా అందుకోలేకపోతే నిరాశ కూడా అంతే స్థాయిలో ఉంటుంది.

సోషల్ మీడియా ప్రభావం కూడా ఇప్పుడు భారీ సినిమాలకు పెద్ద సవాల్‌గా మారింది. గతంలో సినిమా చూసిన తర్వాత అభిప్రాయాలు బయటకు రావడానికి రోజులు పట్టేది. ఇప్పుడు మొదటి షో పూర్తయ్యేలోపే వందలాది రివ్యూలు, రియాక్షన్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్ వార్స్ కారణంగా నెగెటివ్ ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో సినిమా చూడాలనుకున్న ప్రేక్షకుడు కూడా ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాం అనే నిర్ణయానికి వస్తున్నాడు.

అంతేకాదు, మరో సమస్య కూడా కనిపిస్తోంది. ఒక స్టార్ హీరో నాలుగేళ్లకు ఒక సినిమా చేస్తే అభిమానులు అసహనానికి గురవుతారు. దీంతో కొంతమంది హీరోలు వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచనతో తొందరపడి కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కథ పేపర్ మీద బాగానే కనిపించినా, స్క్రీన్ మీద అదే మ్యాజిక్ పనిచేయకపోవడం కూడా జరుగుతోంది. ఫలితంగా సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతోంది.

అయితే పెద్ద సినిమాల వైఫల్యానికి హైప్ ఒక్కటే కారణమని చెప్పలేం. బలమైన కథ, ఎమోషన్, కొత్తదనం ఉంటే భారీ సినిమాలు ఇప్పటికీ చరిత్ర సృష్టిస్తున్నాయి. కానీ కంటెంట్ కంటే హైప్ ఎక్కువైపోతే మాత్రం అదే హైప్ సినిమా మీద భారంగా మారుతోంది. ప్రేక్షకులు ఇప్పుడు స్టార్‌డమ్ కంటే స్టోరీకి ఎక్కువ విలువ ఇస్తున్నారు.

అందుకే నేటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్, స్టార్ హీరో, గ్రాండ్ విజువల్స్, పాన్ ఇండియా మార్కెట్ కంటే కూడా కథే అసలు హీరోగా మారింది. సినిమా చుట్టూ క్రియేట్ చేసిన హైప్ భారీ ఓపెనింగ్స్‌ను తీసుకురాగలదు. ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను పెంచగలదు. కానీ ఆ హైప్‌ను విజయంగా మార్చేది మాత్రం కేవలం కంటెంట్ మాత్రమే. ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వచ్చాక సినిమా బాగుంది అని చెప్పేలా చేయగలిగితేనే అసలు విజయం దక్కుతుంది.

అయితే ఇటీవల కొన్ని భారీ చిత్రాల ఫలితాలను చూస్తుంటే, మార్కెటింగ్, హైప్, రికార్డులు, ఓపెనింగ్స్‌పై ఎంత దృష్టి పెడుతున్నారో.. కథ, కథనాలపై కూడా అంతే స్థాయిలో దృష్టి పెడుతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులను థియేటర్ వరకు తీసుకురావడానికి హైప్ అవసరమే. కానీ వారిని సంతృప్తిపరిచి, సినిమాను దీర్ఘకాల విజయంగా నిలబెట్టేది మాత్రం బలమైన కంటెంట్ మాత్రమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే సినిమాకు హైప్ అనేది భారీ ఓపెనింగ్స్ తెచ్చి పెట్ట‌గ‌ల‌దు.. కానీ కంటెంట్ మాత్రమే సినిమాను నిలబెట్టగలదు అనే మాటను మేకర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply