కౌలాస్ నాల ప్రాజెక్టులోకి చేరిన వరద నీరు

భారీ వర్షాలతో జుక్కల్‌లో జనజీవనం అస్తవ్యస్తం.. రైతుల్లో ఆనందం

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: జుక్కల్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జుక్కల్ మండలంలోని కౌలాస్ నాల ప్రాజెక్టులో బుధవారం తొలిసారిగా స్వల్పంగా వరద నీరు చేరింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రెండు రోజులుగా మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

కౌలాస్ ఎగువ పరివాహక ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 740 క్యూసెక్కుల వరద నీరు చేరిందని ప్రాజెక్టు ఏఈఈ అశ్విని తెలిపారు.

కౌలాస్ నాల ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 454.40 మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు ఆమె వెల్లడించారు.

ఇదిలా ఉండగా, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జుక్కల్ మండలంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు వంగిపోవడంతో పాటు విద్యుత్ తీగలు తెగిపోయాయి. అక్కడక్కడ చెట్లు నేలకూలాయి.

ఆలస్యంగా అయినా మంచి వర్షాలు కురవడంతో మండల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు పంటలకు ఎంతో ఉపయోగపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.