గురువు ఆశీర్వాదమే విద్యార్థి విజయం..

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న బొల్లా


శావల్యాపురం, జులై 29 (ఆంధ్రప్రభ) : గురువుల ఆశీర్వాదంతోనే విద్యార్థులు విజయం సాధిస్తారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పిఏసి సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని వేల్పూరు, కారుమంచి, శావల్యాపురం, పొట్లూరు తదితర గ్రామాల్లోని సాయిబాబా దేవాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామి వారికి ఆవు పాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. వేల్పూరు గ్రామంలో వేంచేసియున్న అనంత శేష సాయి మందిరం నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువు లేని జీవితం అంధకారమేనని ఈ పవిత్రమైన రోజున గురువులను స్మరించుకోవాలన్నారు. ఈ రోజున గురువుల ఆశీర్వాదం పొండితే జ్ఞానం, విజయం, ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతాయన్నారు. బొల్లాతో పాటు ముండ్రు రాఘవరావు, తూమాటి కబ్బయ్య, సాంబశివరావు తదితర నాయకులు ఉన్నారు.

అదేవిధంగా కారుమంచి గ్రామంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.