భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
వాగులు, వంకలు దాటవద్దు.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలి: కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ సూచించారు.
వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.
వర్షాల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. అలాగే తెగిపోయిన విద్యుత్ తీగల వద్దకు వెళ్లకుండా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాహనదారులు నీటితో నిండిన రహదారులపై అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.
ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై వెంకటేష్ కోరారు. ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.
