విజయవాడలో 86కు పెరగనున్న డివిజన్లు

విజయవాడలో 86కు పెరగనున్న డివిజన్లు
- రాజకీయ పార్టీలతో వీఎంసీ కీలక సమావేశం
- ఏప్రిల్ 27న డ్రాఫ్ట్ మ్యాప్ విడుదల
- అభ్యంతరాల స్వీకరణకు 15 రోజుల గడువు
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ నగరపాలక సంస్థ (VMC) పరిధిలో డివిజన్ల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు హద్దుల (బౌండరీల) ఖరారుపై కసరత్తు వేగవంతమైంది. కమీషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
నగర విస్తరణ, జనాభా ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న 64 డివిజన్లను 86కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందించిన డివిజన్ల సరిహద్దుల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన డివిజన్ల బౌండరీలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను, అభ్యంతరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు.
రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకుని, మార్పులు చేర్పులతో కూడిన ‘డ్రాఫ్ట్ డివిజన్ మ్యాప్’ను ఈ నెల 27న (ఏప్రిల్ 27, 2026) పత్రికా ప్రకటన ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. డ్రాఫ్ట్ మ్యాప్ ప్రచురించిన తర్వాత 15 రోజుల పాటు ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తారు. అనంతరం తుది మ్యాప్‌ను ఖరారు చేస్తామని చీఫ్ సిటీ ప్లానర్ వెల్లడించారు. ఈ సమావేశంలో డీప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు పి. మోహన్ బాబు, రాంబాబు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
