కొండపర్వలో కొరమీను పిల్లల పెంపక యూనిట్ ప్రారంభం..

  • వ్యవసాయానికి అనుబంధంగా మత్స్య రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం
  • గ్రామీణ యువతకు ఉపాధి..
  • రైతులకు అదనపు ఆదాయానికి కొత్త అవకాశాలు
  • ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
  • ఆధునిక సాంకేతికతతో చేపల పెంపకం చేపడితే అధిక లాభాలు సాధ్యం

విస్సన్నపేట, ఆంధ్రప్రభ : వ్యవసాయానికి అనుబంధంగా మత్స్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ వనరులను విస్తరించేందుకు తిరువూరు నియోజకవర్గంలో మరో ముందడుగు పడింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో దొనెల్లి రామారావు ఆధ్వర్యంలోని ఉదయ్ ఆక్వా ఏర్పాటు చేసిన కొరమీను చేపల పిల్లల పెంపకం యూనిట్‌ను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యవసాయంతో పాటు మత్స్య పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలక బలంగా మారుతోందన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపల పిల్లల పెంపకం చేపడితే మత్స్యకారులు, రైతులు, యువ పారిశ్రామికవేత్తలకు అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. నాణ్యమైన చేపల పిల్లల ఉత్పత్తి పెరగడం ద్వారా ఆక్వా రంగం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక సహాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇటువంటి ఆక్వా యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. ఉదయ్ ఆక్వా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొరమీను చేపల పిల్లల పెంపకం యూనిట్ విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, నిర్వాహకుడు దొనెల్లి రామారావును అభినందించారు. ఈ తరహా పరిశ్రమలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించి యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు, రైతులు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.