రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్…

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్…
బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని బాపట్ల జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించి, ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులకు ఈ పండుగ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని చేకూర్చాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.
జకాత్ (దానం) ద్వారా పేదలను ఆదుకోవడం ముస్లిం సోదరులలోని గొప్ప మానవత్వానికి నిదర్శనం. అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, సోదరభావంతో మెలగాలని ఆయన కోరారు. గంగా- జమున తహజీబ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ అందరూ కలిసిమెలసి పండుగను జరుపుకోవాలని సూచించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
