17thAprilchintana | వ్యక్తిత్వ వికాసం – విలువలు, నైతికతతో జీవన మార్గం

17thAprilchintana | వ్యక్తిత్వ వికాసంవిలువలు, నైతికతతో జీవన మార్గం

17thAprilchintana | వ్యక్తిత్వాన్ని మలిచే అభ్యాసం & మార్పు
ప్రవర్తనపై ప్రభావం చూపే నమ్మకాలు & విలువలు
నిర్ణయాల్లో భావోద్వేగ నియంత్రణ ప్రాధాన్యం
నైతిక సంఘర్షణలో సరైన ఎంపిక
సమాజంలో వ్యక్తుల నాలుగు రకాల ప్రవర్తనలు
ఆదర్శ జీవనానికి ధర్మబద్ధత మార్గం

17thAprilchintana | ప్రతి వ్యక్తి నిరంతరం తాను ఆనందంగా ఉండాలని, అభ్యుదయాన్ని సాధించాలని కోరుకుంటాడు. అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లవచ్చు. అయినప్పటికీ నిరంతరం నేర్చుకోవడం, పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవచ్చు. అనతికాలంలోనే అతనిలో పరివర్తన రావడం సాధ్యమే. నిరంతరం మంచి పనులు చేయడం ద్వారా సమాజం చేత గౌరవాన్ని పొందడం ప్రేరణగా మారి, అతనిలో వచ్చిన పరివర్తన శాశ్వతమవుతుంది. అలాగే మంచి వ్యక్తి ఎప్పుడైనా చెడు పనులు చేసినా వెంటనే తనను తాను సరిచేసుకుంటాడు.

తన గుర్తింపును నిరూపించుకోవడానికి, తన విలువలను సమాజంలో ప్రతిష్ఠించడానికి, తన నమ్మకాలే ఉదాత్తమని చూపించడానికి వ్యక్తి తన సామర్థ్యాన్ని వినియోగిస్తాడు. ఈ మూడు అంశాలు వ్యక్తి ప్రవర్తనను నేరుగా ప్రభావితం చేస్తాయి. తమ నమ్మకాలతో ఇతరులను ప్రభావితం చేయడానికి అవసరమైతే యుద్ధాలు కూడా చేస్తారు, ప్రాణత్యాగాలకూ వెనుకాడరు. వ్యక్తి ప్రవర్తన తనకు, సమాజానికి శ్రేయస్సును కలిగించేదిగా ఉండటం వ్యక్తి విలువలుగా పరిగణించవచ్చు. కనీసం అది ఇతరులకు హాని కలిగించకూడదు.

భావోద్వేగాలను నియంత్రించుకున్న వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, చర్యలు అతని విలువలకు అద్దం పడతాయి. నైతికత విలువలకు తోడైతే వ్యక్తి ఆదర్శప్రాయుడిగా, ఉత్తమ నాయకుడిగా గుర్తింపు పొందుతాడు. ఇతరులతో ప్రవర్తించే విధానం విలువలు, నైతికతతో కూడి ఉంటే పరస్పరం ఆనందం లభిస్తుంది. వ్యక్తి ప్రకృతితో సహజీవనం చేయగలిగితే అభ్యుదయం సాధ్యమవుతుంది.

ఒక సంస్థలో ఉన్నతాధికారి ఒక వ్యక్తి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. ఆ పని చేయడం వల్ల సంస్థకు పెద్దగా నష్టం ఉండదు. కానీ అది నియమాలకు విరుద్ధం. ఈ పరిస్థితిలో అతనిలో సంఘర్షణ మొదలైంది. తల్లిని సలహా అడిగాడు. “బిడ్డా! నీవు చెప్పే విషయాలపై నాకంతగా అవగాహన లేదు. కానీ ప్రతిరోజూ రాత్రి నీవు ప్రశాంతంగా నిద్రపోతావు. ఉదయం నిన్ను నిద్రలేపడం నాకు అగ్నిపరీక్ష అవుతుంది. ఆ ప్రశాంత నిద్ర పోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటాను” అని తల్లి చెప్పింది. ఈ సమాధానం వ్యక్తి విలువలు, నైతికతకు పెద్దపీట వేయడాన్ని సూచిస్తుంది.

మంచి–చెడు కలగలిపిన సమాజంలో వ్యక్తుల ప్రవర్తనలు వైవిధ్యభరితంగా ఉంటాయి. వాటిని నాలుగు విధాలుగా చూడవచ్చు – చెడు వ్యక్తి చెడు పనులు చేయడం, చెడు వ్యక్తి మంచి పనులు చేయడం, మంచి వ్యక్తి చెడు పనులు చేయడం, మంచి వ్యక్తి మంచి పనులు చేయడం. చెడు పనులు చేసే వ్యక్తిలో అంతర్గత మార్పు వచ్చినప్పుడు సరైన పనులు ఎలా చేయాలో నేర్చుకుంటాడు. సమాజం అతనిని అనుమానించవచ్చు, వింతగా చూడవచ్చు. అయినా అతను తన మార్పును నిరూపించుకోవాలి.

చెడు వ్యక్తి చెడు పనులు చేయడం: ఇలాంటి వ్యక్తుల్లో నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి. మానసిక పరిణతి లోపిస్తుంది. సమర్థత, నిబద్ధత, నిలకడలు లేక స్వార్థపరులుగా మారి విలువలకు ప్రాధాన్యత ఇవ్వరు. రామాయణంలో రావణుడు సీతను అపహరించడం వల్ల లంకానగరం నాశనమైంది. అలాగే దుర్యోధనుని ఈర్ష్యాసూయలు కౌరవ సామ్రాజ్యాన్ని కూల్చివేశాయి.

చెడు వ్యక్తి మంచి పనులు చేయడం: సమాజంలో పటిష్టమైన చట్టాలు, ఉత్తమ సంస్కృతి ఉన్నా వ్యక్తి స్వార్థపరుడైతే క్రమశిక్షణ పాటించడు. రామాయణంలో కైకేయి తప్పు ప్రభావానికి లోనై రాముడిని అడవులకు పంపించింది. అయితే మారీచుడు మాత్రం సత్యాన్ని బోధించాడు. మంచి వ్యక్తి చెడు పనులు చేయడం: విలువలకు కట్టుబడిన వ్యక్తి అయినప్పటికీ ప్రలోభాలకు లోనవుతాడు. రాముడు చెప్పుడు మాటలు విని సీతను అరణ్యాలకు పంపడం, కర్ణుడు స్నేహబంధం కోసం ఆధర్మాన్ని సమర్థించడం దీనికి ఉదాహరణలు.

మంచి వ్యక్తి మంచి పనులు చేయడం: ఇది ఆదర్శ సమాజానికి మార్గం చూపుతుంది. హనుమంతుడు ధైర్యంతో, నిబద్ధతతో సీతను కనుగొన్నాడు. కృష్ణుడు అర్జునుని నిరాశ నుంచి బయటకు తీసుకువచ్చి కర్తవ్యానికి సిద్ధం చేశాడు. శకుంతల, ద్రౌపది వంటి వారు ధర్మబద్ధతకు ప్రతీకలు. చెడు పనులను నిరసించాలి, మంచి పనులను ప్రోత్సహించాలి – అప్పుడే సమాజం సత్పథంలో నడుస్తుంది.

– పాలకుర్తి రామమూర్తి

Leave a Reply