విద్వేషపూరిత పోస్టులు చేస్తే కఠిన చర్యలు
- ఎస్పీ సునీల్ షొరాణ్
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: సామాజిక మాధ్యమాల్లో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు, చిత్రాలు, వ్యాఖ్యలు ప్రచురిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ హెచ్చరించారు. ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించినా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో సామాజిక మాధ్యమంలో మతపరమైన అభ్యంతరకర కంటెంట్‌ను పోస్టు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, మత సామరస్యానికి భంగం కలిగించే లేదా ఇతరుల మనోభావాలను దెబ్బతీసే పోస్టులకు దూరంగా ఉండాలని ప్రజలకు, ముఖ్యంగా యువతకు సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
నందికొట్కూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలు, మత సామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉంటారని, ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావంతో మెలగాలని కోరారు.
