ఉచిత మెగా వైద్య శిబిరం.. ఒకే వేదికపై సమగ్ర వైద్య సేవలు

  • సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
  • జూలై 18, 19 తేదీల్లో వైద్య సేవలు
  • వన్‌టౌన్ గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో…
  • ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
  • దంత, నేత్ర, సాధారణ వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ, ఎక్స్‌రే, 2డీ ఎకో సౌకర్యం
  • అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ
  • సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే పిలుపు

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రెండు రోజులపాటు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు సుజనా చౌదరి ఆధ్వర్యంలో జూలై 18, 19 తేదీల్లో (శని, ఆదివారాలు) వన్‌టౌన్‌లోని గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వైద్య శిబిరం నిర్వహించనున్నారు.

శిబిరంలో దంత, నేత్ర, సాధారణ వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ, ఎక్స్‌రే, 2డీ ఎకో వంటి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. వైద్యుల సూచన మేరకు అవసరమైన రోగులకు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలు అందించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిపుణులైన వైద్యుల సలహాలు పొందాలని కోరారు. శిబిరానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 98492 81731 నంబర్‌ను సంప్రదించాలని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం సూచించింది.