పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

  • సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌తో కీలక భేటీ..
  • ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై పాలమూరు ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి చర్చించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి డిండి వరకు నీటిని తరలించే ప్రతిపాదనపై కూడా చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక అమలులో నిర్వాసితులకు ఎలాంటి నష్టం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా, ఇందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఇప్పటికే నిధులు కూడా విడుదల చేశారని పేర్కొన్నారు. కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాలకు న్యాయం జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి పాలమూరు ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై సీఎం, సాగునీటి శాఖ మంత్రితో సానుకూల చర్చలు జరిగాయని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు.