హస్తకళలకు అండగా కూటమి ప్రభుత్వం

  • ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రాచీన హస్తకళల పరిరక్షణతో పాటు హస్తకళాకారులకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హస్తకళాకారులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉచిత స్టాళ్లు, ప్రయాణ వ్యయాలు, టీఏ–డీఏ సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తకళల అభివృద్ధి, కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో సంప్రదాయ కళల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నగర ప్రజలు హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

లేపాక్షి మేనేజర్ ఎం. సురేష్ మాట్లాడుతూ, లేపాక్షి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఎండీ విశ్వ మనోహర్ కృషితో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన హస్తకళాకారుల కళాఖండాలు, దేవతా విగ్రహాలు, చేనేత వస్త్రాలు తదితర ఉత్పత్తులు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు, విద్యార్థులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో సందర్శించి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో లేపాక్షి మేనేజర్ (అడ్మిన్) డిల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.