మందులు లేవు.. పోషకాహారం లేదు..
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత
- ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న రోగులు
- పోషకాహారం పంపిణీ కూడా నిలిచిపోయిందని ఆరోపణ
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అందాల్సిన మందులు నెలరోజులుగా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎ.కొండూరు మండలంలో వందలాది మంది బాధితులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిపైనే ఆధారపడుతున్నారు. అయితే అవసరమైన మందులు లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారిందని బాధితులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి గురువారం కిడ్నీ నిపుణుడు బాధితులను పరీక్షించి, అవసరమైన మందులను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత నెల రోజులుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, వ్యాధి నియంత్రణకు అవసరమైన మందులు అందుబాటులో లేవని వైద్య సిబ్బంది చెబుతున్నట్లు బాధితులు తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ మెడికల్ దుకాణాల్లో అధిక ధరలకు మందులు కొనుగోలు చేస్తున్నామని వాపోతున్నారు.
మందుల కొరతతో కిడ్నీ బాధితుల ఆవేదన..
ఇప్పటికే డయాలసిస్, రవాణా ఖర్చులు, ఇతర వైద్య వ్యయాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు మందుల కొనుగోలు అదనపు భారం అవుతోందని వారు పేర్కొన్నారు. మరోవైపు, కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అందించే నెలవారీ పోషకాహారం కూడా ఇటీవల అందడం లేదని ఆరోపించారు. మందులు లేక, పోషకాహారం అందక రోగులు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
మండలంలోని మినీ డయాలసిస్ కేంద్రంలో కూడా సమగ్ర వైద్య సేవలు అందడం లేదని, వ్యాధి తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్రత్యేక వైద్య వ్యవస్థ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మూత్రపిండాల వ్యాధులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మందుల సరఫరాను నిరంతరం కొనసాగించడంతో పాటు పోషకాహారం పంపిణీని వెంటనే పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.
అంతేకాకుండా, మందుల సరఫరా ఎప్పుడు పునఃప్రారంభమవుతుందనే విషయంపై కూడా వైద్య ఆరోగ్యశాఖ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడం బాధితుల్లో ఆందోళన కలిగిస్తోంది. అత్యవసరంగా అవసరమైన ఔషధాలను అందుబాటులోకి తీసుకువచ్చి, రోగులకు నిరంతర వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
