10thResults | మీ పిల్లల ప్రాణాలకంటే అవేం ముఖ్యం కాదు

10thResults | మీ పిల్లల ప్రాణాలకంటే అవేం ముఖ్యం కాదు
10thResults | ఫలితాలపై ఆందోళన – తల్లిదండ్రులు జాగ్రత్త
పదోతరగతి – కేవలం ఒక మైలురాయి మాత్రమే
పిల్లలను ఇతరులతో పోల్చొద్దు
విఫలమైనా భరోసా ఇవ్వాలి
ఒత్తిడితో తీసుకునే దారుణ నిర్ణయాలు నివారించాలి
10thResults | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రేపు తెలంగాణలో పదోతరగతి ఫలితాలు విడుదలకానున్నాయి. పాఠశాలలో విద్యార్థి దశ నుంచి కళాశాల విద్యార్థిగా మారేందుకు వేసే అడుగును ఈ ఫలితాలే నిర్ణయించబోతున్నాయి. అయితే రిజల్ట్ అనగానే విద్యార్థులలోనే కాదు.. తల్లిదండ్రులలోనూ ఆందోళన మొదలవుతుంది.
ముఖ్యంగా మా వాడికి ఎన్ని మార్కులు వస్తాయి? పక్కింటి వల్లకంటే మా వాడు ముందు ఉంటాడా? ఇలాంటి లెక్కలతో తల్లిదండ్రులు తెగ గాబరా పడిపోతుంటారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి… ఆ మార్కుల కంటే మీ పిల్లల ప్రాణాలు, సంతోషం ముఖ్యం కాదా.. తల్లిదండ్రులు ఆశించిన ఫలితాలు రానప్పుడు.. ఆ కోపాన్ని పిల్లల మీద చూపిస్తుంటారు. వారికి ఇలాంటి సమయంలో కావాల్సింది శిక్ష కాదు.. మీ నుంచి భరోసా.
ఇదో చిన్న మైలురాయి మాత్రమే..
పదోతరగతి అనేది కెరీర్‌లో ఒక చిన్న మైలురాయి మాత్రమే, అదే గమ్యం కాదు. ఆ మార్కులు సర్టిఫికెట్ లకు మాత్రమే పరిమితం. అవే మీ జీవితాన్ని, భవిష్యత్తును నిర్ణయించవు. ఫెయిల్ అయినా సరే, విద్యార్థులు మీకు ఇష్టమైన రంగంలో (స్పోర్ట్స్, ఆర్ట్స్, టెక్నికల్ కోర్సులు) అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనించాలి. కాబట్టి మార్కుల వేటలో పడి విద్యార్థులు మీ ప్రాణాలను, సంతోషాన్ని బలిచేసుకోకండి.
పక్కవారితో పోలికలు వద్దు..
చాలా మంది తల్లిదండ్రులు చేసే అతి పెద్దతప్పు ఇదే.. పక్కింటి వాళ్ల అబ్బాయికి ఎన్ని వచ్చాయి? చుట్టాల అమ్మాయికి ఎన్ని వచ్చాయి? నీకు ఎందుకు రాలేదు? అని పోల్చడం. ఇలా పోల్చడం వల్ల పిల్లల్లో తమని తాము తక్కువగా భావించుకోవడం పెరుగుతుంది. ఒక్కో విద్యార్థికి ఒక్కో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. వారి సామర్థ్యాన్ని బట్టి వారిని ప్రోత్సహించాలి తప్ప పోలికలతో కుంగదీయకూడదు.
భరోసా ఇవ్వండి..
ఒకవేళ మీ పిల్లలు ఒకటి, రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే వెంటనే భయపడాల్సిన పనిలేదు. సప్లిమెంటరీ పరీక్షలు, రీ-వాల్యుయేషన్ వంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. “ఒక నెల రోజులు కష్టపడితే ఈజీగా పాస్ అవ్వొచ్చు, మేము నీకు తోడుగా ఉంటాం” అని వారికి ధైర్యం చెప్పండి.
రిజల్ట్స్ తర్వాత పిల్లలు గదిలో ఒంటరిగా ఉన్నా, దిగులుగా అనిపించినా వెంటనే వారి దగ్గరకు వెళ్లి స్నేహ పూర్వకంగా మాట్లాడండి. భరోసా ఇవ్వండి.
క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు..
తక్కువ మార్కులు వచ్చినా.. తల్లిదండ్రుల కోపానికి భయపడి లేదా సమాజం ఏమనుకుంటుందో అన్న తీవ్ర మానసిక ఒత్తిడితో చాలామంది విద్యార్థులు క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, ఫలితాలు వచ్చే ముందు నుంచే ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకోండి.
