COLLECTOR| దేశ సేవలో పాల్గొనే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి

- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
COLLECTOR| విజయవాడ, ఆంధ్రప్రభ: భారత వాయు సేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) లో ఉద్యోగ అవకాశాలపై శుక్రవారం విజయవాడలోని లయోలా కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్ లో భారత వాయుసేన అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ… ఇంటర్, తత్సమాన విద్యార్హతలు (పాలిటెక్నిక్, ఐటిఐ) గల విద్యార్థులు అగ్ని వీర్ -వాయుగా భారత వాయుసేనలో చేరవచ్చని చెప్పారు. 17 1/2 సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వయసుగల యువతీ, యువకులు దీనికి అర్హులన్నారు.
చిన్న వయసులోనే దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుందని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని అన్నారు. సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భర్తీ అధికారి మరియు సికింద్రాబాద్ 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ అయిన వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కరీంనగర్, పెద్దపల్లి, గుంటూరు, పల్నాడు జిల్లాలలో అగ్ని వీర్ -వాయు పై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు చెప్పారు. ఇంటర్, తత్సమాన కోర్సుల్లో కనీసం 50% మార్కుల తో పాటు, ఇంగ్లీష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులు అగ్ని వీర్ -వాయు కు అర్హులన్నారు. యువత, తల్లిదండ్రులు ఈ అవగాహన సదస్సుకు హాజరు కావాలని కోరారు. శనివారం తిరువూరు డివిజన్లో మరో అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు.
