కనకదుర్గమ్మకు భక్తుల విరాళాలు..

తీర్థ వితరణ కోసం విలువైన వెండి గిన్నె..
నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళం
(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తులు భక్తిశ్రద్ధలతో విరాళాలు సమర్పించారు. ఆలయ తీర్థ వితరణ కోసం లక్ష రూపాయల విలువైన వెండి గిన్నెను కానుకగా అందించడంతో పాటు నిత్య అన్నదాన పథకానికి మరో కుటుంబం రూ.1,01,116 విరాళం సమర్పించింది.

హైదరాబాద్‌లోని నాగోలు, ఎల్‌బీనగర్‌కు చెందిన సత్యనారాయణ–భారతి దంపతులు తమ కుమారుడు జి. వెంకట అజయ్ కుమార్ పేరుపై 374 గ్రాముల బరువున్న, సుమారు రూ.1 లక్ష విలువైన వెండి గిన్నెను శ్రీ అమ్మవారి తీర్థ వితరణ కోసం ఆలయానికి విరాళంగా అందజేశారు. ఆలయ అధికారులు, అర్చకులను కలిసి భక్తిశ్రద్ధలతో ఈ కానుకను సమర్పించారు. అలాగే హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వై. శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళాన్ని సమర్పించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, అర్చక స్వాముల సమక్షంలో వారు స్వయంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయక ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదు అందజేశారు.