ఉత్సాహంగా యోగాంధ్ర పోటీలు..
ఉత్సాహంగా యోగాంధ్ర పోటీలు..
ఈ నెల 16వ తేదీ వరకు జిల్లాస్థాయిలో నిర్వహణ
జిల్లా ఆయుష్ అధికారి డా. వై.రత్నప్రియదర్శిని
విజయవాడ, ఆంధ్రప్రభ : యోగాంధ్ర-2026లో భాగంగా యోగా పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయని.. ఇప్పటికే ప్రారంభమైన జిల్లాస్థాయి పోటీలు ఈ నెల 16వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా ఆయుష్ అధికారి డా. వై.రత్నప్రియదర్శిని తెలిపారు. విజయవాడ అర్బన్ పరిధిలోని ఐవీ పేలస్‌లో సోమవారం జిల్లాస్థాయి యోగా పోటీలు జరిగాయని.. యోగా అండ్ యూత్ – బిల్డింగ్ ఎ హెల్దీ ఫ్యూచర్ థీమ్‌తో ఈ పోటీలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలు ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు యోగాంధ్ర-ఆంధ్రాస్ గ్లోబల్ యోగా షోకేజ్ థీమ్‌తో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. గ్రామ, మండల స్థాయిలో జరిగిన పోటీల్లో విజేతలైన 30 మంది సోమవారం నాటి పోటీల్లో పాల్గొన్నారని వివరించారు.

వ్యక్తిగత కేటగిరీ, గ్రూపు కేటగిరీలో పోటీలు జరుగుతున్నాయని.. వ్యక్తిగత కేటగిరీలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం ప్రదర్శనలు, గ్రూపు కేటగిరీలో సింక్రనైజ్డ్ గ్రూపుయోగా ఉన్నాయన్నారు. యోగా సాంగ్, యోగా క్విజ్, యోగా స్లోగన్, యోగా ఎస్సే పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ (10-18 ఏళ్లు), యంగ్ (19-35 ఏళ్లు), సీనియర్ గ్రూప్ (35 ఏళ్లు, ఆపైన) విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ వారి దిశానిర్దేశంతో సమన్వయ శాఖల అధికారులతో కలిసి పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేస్తున్నట్లు ఆయుష్ అధికారి ప్రియదర్శిని తెలిపారు.
