విద్యాసంస్థలను పర్యావరణహిత కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు..
విద్యాసంస్థలను పర్యావరణహిత కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు..
‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ ప్రారంభం
గన్నవరం, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని గొల్లనపల్లి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వసతి గృహ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆమె, ఉపాధి హామీ పథకం సిబ్బంది, హార్ట్ఫుల్నెస్ బృంద సభ్యులతో కార్యక్రమ అమలుపై సమీక్ష నిర్వహించారు.
మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను పర్యావరణహిత ప్రాంగణాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,047 విద్యాసంస్థలను ఈ కార్యక్రమం కింద గుర్తించగా, కృష్ణా జిల్లాలో 19 విద్యాసంస్థలు ఎంపికైనట్లు వెల్లడించారు.
గొల్లనపల్లి వసతి గృహాన్ని ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొంటూ, ‘అనంత ఆరణ్య’ విధానంలో సుమారు 0.25 ఎకరాల విస్తీర్ణంలో 1,650కు పైగా మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. మొక్కల పెంపకం, సంరక్షణ, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, కంపోస్టింగ్ యూనిట్ల స్థాపన, వర్షపు నీటి సంరక్షణ గుంతల నిర్మాణం, అనంత ఆరణ్య నమూనాలో అధిక సాంద్రతతో మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
ఈ చర్యల ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు పచ్చదనం పెంపొందించడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని తెలిపారు.
భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, పచ్చని, పర్యావరణహిత విద్యా వాతావరణాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని లావణ్య వేణి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్ బాబు, పాఠశాల ప్రిన్సిపాల్ కె. జగదీశ్వరరావు, సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది, హార్ట్ఫుల్నెస్ బృంద సభ్యులు పాల్గొన్నారు.
