ఓటర్ల హక్కులకు భంగం కలిగిస్తే సహించం

ఓటర్ల హక్కులకు భంగం కలిగిస్తే సహించం

ప్రతి అర్హుడి ఓటును కాపాడటం బీఎల్ఏల బాధ్యత: ఉషశ్రీ చరణ్

పెనుకొండ, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ఓటర్ల హక్కులను కాపాడటం ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ) ప్రధాన బాధ్యత అని ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు.

పెనుకొండ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ స్థాయిలో బీఎల్ఏలు చేపట్టాల్సిన బాధ్యతలు, ఓటర్ల జాబితా పరిశీలన విధానం, సవరణ ప్రక్రియలో పాటించాల్సిన అంశాలపై నాయకులు సమగ్రంగా వివరించారు.

ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలు ఎక్కడైనా జరిగితే వాటిని క్షేత్రస్థాయిలోనే గుర్తించి అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రత్యేక సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడం, అనర్హుల పేర్లు చేర్చడం, మ్యాపింగ్ ప్రక్రియలో పొరపాట్లు లేదా అక్రమాలు జరగకుండా ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలోని ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఉషశ్రీ చరణ్ విమర్శించారు. ప్రజల ఓటు హక్కును హరించే ఏ ప్రయత్నాన్నైనా ప్రజల సహకారంతో తిప్పికొడతామని పేర్కొన్నారు.

శిక్షణ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఏలకు ERMS, NVSP వినియోగం, కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6, అభ్యంతరాలు, తొలగింపులకు సంబంధించిన ఫారం-7, వివరాల సవరణకు సంబంధించిన ఫారం-8 తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే సెల్ఫ్ మ్యాపింగ్, ప్రాక్సీ మ్యాపింగ్, ఓటర్ల ధృవీకరణ, అభ్యంతరాల నమోదు ప్రక్రియలపై వివరించారు.

ప్రతి గ్రామంలో, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిరంతరం పరిశీలిస్తూ ఒక్క అర్హుడైన ఓటరు పేరు కూడా తొలగిపోకుండా చూడాలని ఉషశ్రీ చరణ్ బీఎల్ఏలకు సూచించారు. ప్రజల ఓటు హక్కుల పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుందని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆమె తెలిపారు.