అక్రమ ఇసుక రవాణాపై వైరా పోలీసుల ఉక్కు పాదం…
అక్రమ ఇసుక రవాణాపై వైరా పోలీసుల ఉక్కు పాదం…
- ముగ్గురు అరెస్ట్.. లారీ, థార్, టిప్పర్ స్వాధీనం
వైరా, ఆంధ్రప్రభ : ప్రభుత్వానికి చెందిన సహజ వనరులైన ఇసుకను అక్రమంగా తవ్వి, రవాణా చేసి విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్న ఇసుక మాఫియాపై వైరా పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు.
వైరా పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైరా ఏసీపీ సాదుల సారంగపాణి మాట్లాడుతూ, వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముఠాను గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో వైరా సీఐ వెంకట ప్రసాద్, ఎస్ఐ పుష్పాల రామారావు, వైరా-2 ఎస్ఐ పవన్, చింతకాని ఎస్ఐ నరేష్, కొనిజర్ల ఎస్ఐ సూరజ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దోనబండ రీచ్ నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, మైనింగ్ పర్మిట్లు, ట్రాన్స్పోర్ట్ చలానాలు లేదా ఈ-బిల్లులు లేకుండా సుమారు 25 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన చల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు చల్లమల్ల సుమంత్కుమార్, లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ లారీ, ఎస్కార్ట్ వాహనంగా వినియోగించిన మహీంద్రా థార్ కారు, ఇసుక విక్రయాల కోసం ఉపయోగిస్తున్న టిప్పర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దర్యాప్తులో నిందితులు ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేసి ఖమ్మంతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు అంగీకరించినట్లు చెప్పారు.
నిందితుల నేర చరిత్రను పరిశీలించగా, చల్లమల్ల సుమంత్కుమార్పై మొత్తం 12 క్రిమినల్ కేసులు నమోదై ఉండగా, కొన్ని కేసుల్లో శిక్షలు కూడా విధించబడినట్లు గుర్తించామని తెలిపారు. అలాగే చల్లమల్ల వెంకటేశ్వరరావుపై ప్రస్తుత కేసుతో కలిపి నాలుగు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గతంలో మోసం, దొంగతనం, అక్రమ ఇసుక రవాణా తదితర నేరాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు.
అలవాటుగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై హిస్టరీ షీట్లు తెరవడం, నిరంతర నిఘా ఏర్పాటు చేయడం, అవసరమైతే రౌడీషీట్లు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఏసీపీ తెలిపారు.
అక్రమ ఇసుక తవ్వకం, రవాణా, నిల్వ, కొనుగోలు లేదా విక్రయాల్లో పాల్గొనే వ్యక్తులు, వాహన యజమానులు, డ్రైవర్లు, మధ్యవర్తులు లేదా సహకరించే ఎవరైనా చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.
అక్రమ ఇసుక రవాణా, నిల్వ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేసి చట్ట పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ధిక్కరించే వారికి కఠిన చర్యలు తప్పవని, ఇసుక అక్రమ మాఫియాను ఏ రూపంలోనూ సహించబోమని స్పష్టం చేశారు.
