ప్రపంచ పులుల దినోత్సవం…
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అవగాహన కార్యక్రమాలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ: ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఆధ్వర్యంలో అచ్చంపేట, అమ్రాబాద్ డివిజన్‌లలో బుధవారం పలు అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పులుల సంరక్షణ, అటవీ జీవ వైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా అచ్చంపేట ఫారెస్ట్ కాంప్లెక్స్ నుంచి బస్టాండ్ వరకు, అలాగే మన్ననూర్‌లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది భారీ బైక్ ర్యాలీలు నిర్వహించి పులుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం అచ్చంపేట ఫారెస్ట్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అచ్చంపేట డివిజన్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామమూర్తి, ఫ్లయింగ్ స్క్వాడ్ డివిజనల్ అధికారి రామ్మోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా అటవీశాఖ సిబ్బంది వన్యప్రాణుల రక్షణలో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. అటవీ సంపద, జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని తెలిపారు.
ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అచ్చంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్‌లను బహుమతులుగా అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమాల్లో అచ్చంపేట, అమ్రాబాద్ డివిజన్‌లకు చెందిన అటవీశాఖ ఫీల్డ్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రపంచ పులుల దినోత్సవాన్ని విజయవంతం చేశారు.
