వర్షాలకు జలమయమైన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి
ఆవరణలో నిలిచిన వర్షపు నీరు.. రోగులు, సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణ జలమయమైంది. ఆస్పత్రి ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆస్పత్రి ఆవరణలో నీరు నిలవడంతో ఓపీ విభాగం, వార్డులు, ఇతర విభాగాలకు వెళ్లేందుకు ప్రజలు నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
వర్షపు నీరు నిల్వ ఉండడంతో ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగులు జారి పడే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటున్నారు.
ప్రతి వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆస్పత్రి ఆవరణలో వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.
తక్షణమే నిల్వ నీటిని తొలగించి, రోగులు, వైద్య సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
