వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య సూచించారు.
బుధవారం చందపల్లి 17వ వార్డు, పెద్దమ్మనగర్ ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ, రంగంపల్లి 11వ వార్డు సాయి గార్డెన్, రాంపల్లి డబుల్ బెడ్‌రూం కాలనీల్లో వర్షపు నీరు చేరిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు.
డబుల్ బెడ్‌రూం కాలనీలో వరద ఉధృతి అధికంగా ఉన్నందున అవసరమైతే బాధితులకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు పూదరి మహేందర్, తోట ఫణీందర్, అక్కపల్లి సుజాత క్రాంతి, నదీమ్, పూదరి లత సుభాష్, మొలుగురి కమల్, జూనియర్ అసిస్టెంట్లు రమాకాంత్, సురేందర్, వార్డు అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పులిపాక రాజు, జవాన్ బొంగోని అనిల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
