విద్యార్థులకు చట్టాలపై అవగాహన..
పొణంగి పాఠశాలలో పోలీసుల ప్రత్యేక సదస్సు
ఏలూరు, ఆంధ్రప్రభ: విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో స్పందించే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పొణంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు, ఏలూరు వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ ఎస్సై వి. వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు, అగ్నిమాపక, వైద్య సేవల కోసం డయల్-112ను వెంటనే సంప్రదించాలని సూచించారు. పిల్లల రక్షణకు సంబంధించిన సమస్యల కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించేందుకు 1072 హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని వివరించారు.
అలాగే మహిళలు, బాలికల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్ గురించి ప్రత్యేకంగా వివరించారు. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే విధానం, అత్యవసర సమయంలో ఎస్ఓఎస్ (SOS) బటన్‌ను ఉపయోగించి తక్షణ సహాయం ఎలా పొందవచ్చో ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా విద్యార్థులకు తెలియజేశారు.
విద్యార్థి దశలో చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు పోలీసు అధికారులు తెలిపిన సూచనలను ఆసక్తిగా విని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు యువతలో బాధ్యతాయుతమైన పౌరస్పృహను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
