వరద పరిస్థితులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

శిథిలావస్థ ఇళ్లలో ఉండొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కోయ శ్రీహర్ష

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి రాజీవ్ రహదారి వద్ద వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం పరిశీలించారు. వరద పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకుని ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ నివసించవద్దని, అలాంటి కుటుంబాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

వర్షాల కారణంగా ఎక్కడైనా నీరు నిల్వ ఉండటం, వరద ముప్పు ఏర్పడటం వంటి పరిస్థితులపై నిరంతరం నిఘా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్‌కు కలెక్టర్ సూచించారు. మున్సిపల్ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.

పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు పూదరి మహేందర్, తోట ఫణీందర్, అక్కపల్లి క్రాంతి సుజాత, నదీమ్, తూముల లత సుభాష్, మొలుగురి కమల్, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, వార్డు అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.