భక్తులతో కలిసి అన్నదానంలో ఎమ్మెల్యే కందికుంట

భక్తులతో కలిసి అన్నదానంలో ఎమ్మెల్యే కందికుంట
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అన్నదాన కేంద్రాన్ని సందర్శించి, భక్తులకు వడ్డిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, వంట ఏర్పాట్లను పరిశీలించారు.
అన్నదాన కేంద్రంలో భక్తులకు అందిస్తున్న ఆహార పదార్థాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా ప్రసాద భోజనం స్వీకరించేలా ఏర్పాట్లు ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, కూర్చునే సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నదాన కేంద్రంలో భక్తులతో కలిసి సాధారణంగా కూర్చుని భోజనం చేశారు. ఎమ్మెల్యే తమతో కలిసి భోజనం చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ సంప్రదాయాల్లో భక్తుల సేవకు అన్నదానం పవిత్రమైన కార్యక్రమమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తులకు నిత్యం నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం, దేవస్థానం కలిసి కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
