ఆగస్టు 1నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు..

జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం : ఐసిడిఎస్ పిడి ప్రగడ విజయ


కర్నూలు రూరల్ బ్యూరో, జూలై 31, ఆంధ్రప్రభ : శిశువుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, సంపూర్ణ పోషణకు తల్లిపాలే అత్యుత్తమ ఆహారమనే సందేశాన్ని ప్రతి కుటుంబానికి చేరవేసే లక్ష్యంతో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను వేదికగా చేసుకుని గర్భిణులు, బాలింతలు, కుటుంబ సభ్యుల్లో తల్లిపాల ప్రాధాన్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ,సాధికారత అధికారి ప్రగడ విజయ తెలిపారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి ప్రగడ విజయ వెల్లడించారు.

ప్రసవం జరిగిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించడం, మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, అనంతరం తగిన అనుబంధ ఆహారంతో పాటు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం ద్వారా శిశువులు ఆరోగ్యంగా ఎదుగుతారని ఆమె వివరించారు.

వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు కౌన్సెలింగ్, గ్రామ సభలు, అవగాహన ర్యాలీలు, గృహ సందర్శనలు, ఐఈసీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తల్లిపాల ప్రాధాన్యత, శిశు పోషణ, తల్లి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల సహకారం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాన అంశాలు…
1.శిశు, చిన్నారుల పోషణ (ఐవైసీఎఫ్) విధానాలపై అవగాహన. 2.ప్రసవం అనంతరం వెంటనే తల్లిపాలు ప్రారంభించేలా ప్రోత్సాహం.3. మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలనే సందేశం. 4.తల్లిపాలిచ్చే తల్లులకు కుటుంబ సభ్యులు, సమాజం నుంచి సహకారం అందేలా చైతన్యం.5. తల్లి ఆరోగ్యం, పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన.ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయడంలో జిల్లాలోని గర్భిణులు, బాలింతలు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత అధికారి ప్రగడ విజయ పిలుపునిచ్చారు. తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి ఇంటికీ చేర్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.